పుల్లా భొట్ల వేంకటేశ్వర్లు
ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ సాహితీవేత్త, రచయిత పుల్లాభొట్ల వేంకటేశ్వర్లు 1924వ సంవత్సరం నవంబర్ 14న జన్మించారు. 1940 నుండే సాహితీ సృజనను ప్రారంభించిన ఆయన, నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ ప్రజాపోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఈ పోరాట సమయంలో 1947 మరియు 1948 సంవత్సరాలలో రెండుసార్లు మృత్యుముఖం నుండి బయటపడటం విశేషం.
సాహిత్య వ్యాసంగం మరియు రచనలు:
పుల్లాభొట్ల వారి రచనా వ్యాసంగం కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ సాహితీ వ్యాసంగాన్ని పోలి ఉంటుందని చెప్పబడుతుంది. 1962లో ఆయన "మాఘంటం" నవల ప్రచురితమైంది. తెలంగాణ ప్రజాపోరాటానికి తెరవెనుక జరిగిన కథ ఈ నవల ఇతివృత్తంగా వేంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ నవల ఆనాటి అమాయక ప్రజలు పడిన బాధలను కళ్ళకు కట్టినట్లు చిత్రించింది.
సాహిత్య పరిశోధన రంగంలోనూ పుల్లాభొట్ల వారి కృషి గణనీయమైంది. వారు రచించిన "తెలుగు నవలా వికాసం" పరిశోధక గ్రంథానికి 1977లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి అవార్డు లభించింది. వారు శతాధిక గ్రంథకర్తగా అనేక రచనలు చేశారు. ఆదిరాజు వారి జీవితచరిత్ర, కేసరిద్వయం, స్వాతంత్ర్యోద్యమ రథసారథులు, మహావిజ్ఞాన వేత్తలు, క్రాంతిరేఖలు వంటి జీవిత చరిత్రలు రచించారు. భక్తుల, వాగ్గేయకారుల జీవిత చరిత్రలను కూడా గ్రంథస్థం చేశారు. సంగ్రహాంధ్ర విజ్ఞానకోశంలో వందకు పైగా వ్యాసాలు వివిధ విషయాలపై వ్రాశారు.
మహాకవి గురజాడ శతజయంతి సంచికను ఖమ్మం శాఖ తరఫున వారి సంపాదకత్వంలో ప్రచురించారు. త్యాగరాజ సావనీరు వెలువరించడంలో కళారాధన మండలి వారికి సహకరించారు. ఆంధ్రదేశంలోని ప్రముఖ దేవాలయాలన్నింటిని గురించీ వ్రాశారు. హీరాలాల్ మోరియా వచన, గేయ కావ్యాలపై విమర్శ గ్రంథాన్ని రచించారు. ఇంకా వందలాది వ్యాసాలు, కథలు వ్రాశారు.
కథా సంపుటాలు:
పుల్లాభొట్ల వారి కథా సంపుటాలుగా "పుల్లాభొట్ల కథలు", "గాడితప్పిన జీవితాలు", "మూడు వాక్చిత్రాలు" వెలువడ్డాయి. ఈ మూడింటిని కలిపి "పిన్ని చాలా మంచిది" అనే పేరుతో తిరిగి ప్రచురించారు. 24 కథలతో కూడిన "వెన్నెలకిరణాలు" కథా సంపుటాన్ని వారి సాహిత్య స్వర్ణోత్సవ సంవత్సరం 1990లో ప్రచురించారు. వారి మొదటి కథ 'పుట్టుమచ్చ' 1950లో ఆంధ్ర పత్రిక దినపత్రిక ఆదివారం అనుబంధంలో ప్రచురితమైంది.
ఇతర రచనలు మరియు అనుభవాలు:
1940లో రచనా వ్యాసంగాన్ని ప్రారంభించి "సముద్రఘోషలు" అనే పేరుతో వెయ్యి పేజీల నవల వ్రాశారు. ఇది ప్రస్తుతం అలభ్యం. ఈ నవలలో ఆనాటి నిజాం సంస్థానంలోని ప్రజలు నిరంకుశ ప్రభువుల పాలనలో పడిన ఇబ్బందులను సహజ సిద్ధంగా చిత్రించారు. రాధ అనే సాంఘిక నవల కూడా రచించారు. విశ్వనాథ సత్యనారాయణ గారి గేయ కావ్యాలు, లఘు కావ్యాలపై అనేక విమర్శనాత్మక వ్యాసాలు వ్రాశారు. 1988లో 'క్రాస్ట్రక్' అన్న పెద్ద కథల సంపుటిని వెలువరించారు.
వ్యక్తిగత జీవితంలోనూ ఆయన అనేక గండాల నుండి బయటపడ్డారు. 1979లో కుటుంబంతో దక్షిణ దేశయాత్ర చేస్తూ శ్రీరంగం వద్ద కావేరీ నదిలో, 1987లో ఉత్తర దేశయాత్రలలో గంగోత్రి, యమునోత్రి తీర్థాలు సేవిస్తూ మంచు ముద్దలలో స్నానం చేస్తూ మృత్యుముఖం నుండి తప్పించుకున్నారు. పరమేశ్వరానుగ్రహం వల్లే ఇన్ని గండాల నుంచి బయటపడ్డానని ఆయన వినయంగా చెప్పుకుంటారు.
మిత్ర బృందం మరియు గుర్తింపులు:
పుల్లాభొట్ల వేంకటేశ్వర్లు మిత్ర మండలి చాలా విశాలమైంది. కొలిపాక మధుసూదనరావు, మోతుకూరి కోటయ్య, హీరాలాల్ మోరియా, కందుకూరి లింగరాజు, డా|| యాలమంచిలి రాధాకృష్ణమూర్తి, గురజాల సుబ్బారావు, దేవులపల్లి వెంకటేశ్వరరావు, భీమ్ సేన్ నిర్మల్, పిల్లలమర్రి వేంకటహనుమంతరావు, పురాణం సుబ్రహ్మణ్యశర్మ, అక్కిరాజు రమాపతి రావు, శీలా వీర్రాజు, కాళోజీ నారాయణరావు, కె.వై.యల్ నరసింహారావు, కొండముది శ్రీరామచంద్రమూర్తి, జూపుడి నరసింహారావు, జి.వి. సుబ్రహ్మణ్యం, యం.యల్. నరసింహారావు, అన్నవరం ఆదిశేషయ్య వంటి ఎందరో సాహితీ బంధువులు, రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఆయన మిత్రులు. వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
పుల్లాభొట్ల వేంకటేశ్వర్లు 34 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగి పదవీ విరమణానంతరం మరే ఉద్యోగంలో కొనసాగకుండా నిరంతరం సాహితీ సేవ చేస్తూ సరస్వతీ పదకమలాలను అర్చించారు. వారికి సాహిత్యాచార్య, సమీక్షా శిరోమణి, మహోపాధ్యాయ, సాహిత్య భూషణ వంటి ఎన్నో బిరుదులున్నాయి